ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ఏరి ఆ విప్లవానికి 'మంత్రసానులు?

మార్పు కోసం కదం తొక్కిన 'సోవియట్లు, మహిళలు’ ఏమైనట్టు?

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

రష్యాలోని పెట్రోగ్రాడ్ లో 1917 మార్చి 8న మహిళలు చేసిన సమ్మె రష్యా విప్లవానికి ఆరంభం అని చాలా మందికి తెలియదు. 1917నాటి రష్యా విప్లవానికి - అక్టోబర్ విప్లవానికి - పశ్చిమ దేశాల జూలియన్ కాలెండర్ ప్రకారం నవంబర్ విప్లవానికి 20వ శతాబ్ది రాజకీయాలను సమూలంగా మార్చడంలో విశిష్ట స్థానం ఉందనడం నిస్సందేహమే. రాచరికానికి, నిరంకుశ పాలనకు చరమ గీతం పాడడంలో ఫిబ్రవరి నాటి పరిణామంలో - పశ్చిమ దేశాల జూలియన్ కాలెండర్ ప్రకారం మార్చి నాటి ఉదంతాలలో కార్మికులకు, సైనికులకు (సైనికులు అంటే చాలా వరకు సైనిక దుస్తుల్లో ఉన్న రైతులే ఎక్కువమంది) పెట్టుబడిదారీ విధానాన్ని వ్యతిరేకించాలన్న ఉద్దేశం లేదు. పెట్టుబడిదారీ విధానానికి, కులీన వర్గానికి ప్రాతినిధ్యం వహించే కాడెట్ పార్టీకి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చారు.

మొదటి ప్రపంచ యుద్ధం మధ్యలో 1917 శీతాకాలంలో సామాన్య ప్రజల బతుకు దుర్భరం అయింది. ఆహారం, ఇంధనం కొరత విపరీతంగా పెరిగింది. కార్మికులు, వారి కుటుంబాలు పేదరికంలో కూరుకుపోయాయి. 1905 విప్లవానికి నాందీ పలికిన రకసిక్తమైన ఆదివారం విఫలమైంది. కాని ఆ రోజుకు చిహ్నంగా పెట్రోగ్రాడ్ లో సమ్మెలు, నిరసన ప్రదర్శనలు జరిగాయి. ప్యుటిలోవ్ వర్క్స్ లో లాక్ ఔట్ పోరాట మటిమను పెంచింది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న అంటే పశ్చిమ దేశాల జూలియన్ కాలెండర్ ప్రకారం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున జౌళి పరిశ్రమల్లో పని చేసే మహిళలు భారీ సంఖ్యలో పెట్రోగ్రాడ్ వీధుల్లోకి వచ్చి ఆహారం కావాలని గట్టిగా కోరడం ఆ తర్వాతి పరిణామాలకు బీజం వేసింది. ఈ సమ్మె ఆరంభం అయిన మొదటి రోజే ఫిబ్రవరి విప్లవానికి ఆరంభం అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే సాహసోపేతమైన, కృతనిశ్చయంతో ఉన్న ఈ మహిళలే వైబోర్గ్ జిల్లాలోని బోల్షెవిక్ ల నాయకత్వం లోని లోహ పరిశ్రమ కార్మికులను ఉద్యమం లోకి లాక్కొచ్చారు. నిజానికి ఆ కార్మికులు చాలా పోరాట పటిమ కల వారు. వారు మహిళల ఉద్యమానికి దన్నుగా నిలిచారు.

ఫిబ్రవరి విప్లవానికి మహిళలు మంత్రసానుల్లా పని చేశారని చెప్పడం అతిశయోక్తి కావొచ్చు కాని వారి చర్య 90,000 మంది కార్మికులను వీధుల్లోకి తీసుకురాగలిగింది. తదనంతర పరిణామాలకు నాందీ వాక్యం పలికింది. ఆ మరుసటి రోజే వీధుల్లోకి వచ్చిన వారి సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. ఆహారం కోసం అడగడం మరింత స్పష్టమైన రాజకీయ నినాదాలకు దారి తీసింది. "నిరంకుశత్వం నశించాలి", "యుద్ధం అంతం కావాలి" లాంటి నినాదాలకు తావిచ్చింది. అందువల్లే శాంతి భద్రతలను నెలకొల్పడానికి నియమించిన సైనికులతో  మహిళలు ఘర్షణ పడగలిగారు. "కామ్రేడ్స్ మీ బాయొనెట్లను కింద పడేసి మాతో చేరండి" అని నినదించారు. రైతుల నేపథ్యం నుంచి వచ్చిన చాలా మంది సైనికులు చలించి పోయారు. నిరసనకారులతో కలిసిపోయారు. ఫిబ్రవరి 26 నాటికి (కొత్త కాలెండర్ ప్రకారం మార్చి 11) తిరుగుబాటు మొదలైంది. ప్రజలు విజయం సాధించగలరు అనుకున్నప్పుడు మాత్రమే సైనికులు తిరగబడతారు. అప్పుడే వారు ప్రజలతో మమేకం అవుతారు. ఈ మార్పు తీసుకు రావడంలో మహిళా కార్మికులు నిర్వహించిన పాత్ర సామాన్యమైంది కాదు.

మార్చి 12 నాటికి తిరుగుబాటు సఫలమై జార్ చక్రవర్తి పదవీచ్యుతుడయ్యాడు. కాని తిరుగుబాటు విజయవంతమైన తర్వాత సైద్ధాంతిక శక్తి (అంటే కుహనా చైతన్యం) చాలా బలంగా ఉంది. జార్ల అధికారం స్థానంలో అధికారం చేపట్టడానికి బూర్జువా శక్తి సిద్ధంగా ఉంది. అయితే దీనికి సమాంతరంగా ఫిబ్రవరి విప్లవం క్రమంలో సోవియట్ ఆఫ్ వర్కర్స్, సైనికుల డెప్యూటీలు, కార్మిక, సైనిక మండళ్లు ఏర్పడినందువల్ల ప్రత్యామ్నాయ అధికార కేంద్రం ఏర్పడింది. కాని కాడెట్ పార్టీ నాయకుల ఆధిపత్యంలో ఉన్న తాత్కాలిక ప్రభుత్వం విప్లవం లో ముందుకొచ్చిన సమస్యలను, కోర్కెలను తీర్చడానికి అడ్డంకిగా తయారైంది.

కొత్త ప్రభుత్వం గాని, ఆ మాటకు వస్తే ఏ బూర్జువా ప్రభుత్వం అయినా తమ సమస్యలను పరిష్కరించలేదని కార్మికులు, సైనికులు (సైనిక దుస్తుల్లో ఉన్న రైతులు) భావించడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ప్రజాస్వామ్య గణతంత్రాన్ని, గ్రామీణ ప్రాంతాలలో సంపన్న భూస్వామ్య వర్గాల దగ్గర ఉన్న భూమిని స్వాధీనం చేసుకుని రైతులకు పంచడానికి, రష్యా సామ్రాజ్యవాద కాంక్షను అంతమొందించడానికి, శాంతి కోసం పాటు పడడానికి, రోజుకు ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయడానికి తాత్కాలిక ప్రభుత్వానికి శక్తి లేదని గ్రహించారు. ఒక వైపు తాత్కాలిక ప్రభుత్వం తమదే ("మనదే") అన్న పొరపాటు అవగాహన, మరో వైపు పెట్టుబడిదార్లు లాక్ ఔట్ల ద్వారా పొంచి ఉన్న విప్లవ ప్రతీఘాతుక సైనిక తిరుగుబాటు వల్ల కార్మికులు, సైనికులు, రైతులు తమ సమస్యలు తీరాలంటే ఈ ప్రభుత్వాన్ని పడదోయాల్సిందే అన్న నిర్ధారణకు వచ్చి సోవియట్ల ప్రభుత్వం ఏర్పాటే మార్గం అని నిర్ణయించుకున్నారు.

అక్టోబర్ (అంటే నవంబర్) లో సోవియట్ల అధికారం వచ్చింది. కాని జార్ల పరిపాలనను పడదోయడంలో నిర్ణాయక పాత్ర పోషించిన మహిళలు తెరమరుగు అయిపోయారు. తాత్కాలిక ప్రభుత్వాన్ని గద్దె దించడంలో పురుషులు ప్రధాన పాత్ర పోషించారు. కాని స్వతంత్ర, స్వయం పరిపాలనాధికారం గల సోవియట్ల అధికారం కూడా 1918 వేసవి కాలాన్ని మించి కొనసాగలేదు. రష్యా కార్మిక వర్గానికి, విప్లవంలో నిర్ణాయక పాత్ర పోషించిన మహిళలకు సోవియట్లలో, పరిశ్రమలలో తగిన ప్రాధాన్యత దక్కక పోవడం ఓ వైపరీత్యం.

తమ సర్వసాన్ని అర్పించే, నిస్వార్థంగా మానవత్వాన్ని ప్రదర్శించే సామాన్య మానవులు ఎప్పుడూ కులీన వర్గాల చేతిలో పరాజితులు కావాల్సిందేనా?

 

 

Updated On : 13th Nov, 2017
Back to Top