ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

బీజేపీకి మేలు చేసిన సుప్రీం కోర్టు

బాబరీ వివాదంలో తీర్పు ద్వారా సుప్రీం కోర్టు అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ (బీజేపీ) 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

కి ఒక రకంగా మేలే చేసింది. బాబరీ మసీదు శిథిలాల మీద రామ మందిర నిర్మాణం అంశం కొనసాగడానికి సుప్రీం కోర్టు తీర్పు తోడ్పడుతుంది. నిజానికి సుప్రీం కోర్టుకు ఆ ఉద్దేశం లేకపోవచ్చు. పాతికేళ్ల కింద బాబరీ మసీదును కూల్చి వేసిన సందర్భంగా రెండు కేసులు ఉన్నాయి. ఒక దానిలో ఎల్.కె.అద్వాణీ, మురళి మనోహర్ జోషి, ఉమా భారతి వంటి బీజేపీ అగ్ర నాయకుల మీద 16వ శతాబ్దం నాటి బాబరీ మసీదును కూల్చడానికి కుట్రపన్నారన్న అభియోగం ఉంది. మరో వేపున బాబరీ మసీదును కూల్చి వేసినందుకు ఈ విధ్వంసంలో పాల్గొన్న కర సేవకుల మీద మరో కేసు ఉంది. ఈ రెండు కేసులను కలగలపి విచారించాలని ఏప్రిల్ 23న సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ రెండు కేసులను లక్నో కోర్టులో విచారించాలని చెప్పింది. ఈ తీర్పు వల్ల మతపరంగా ఉద్రిక్తపూరితమైన రామ మందిర నిర్మాణ అంశాన్ని సజీవంగా ఉంచడానికి బీజేపీకి ఈ తీర్పు దోహదం చేస్తుంది. తద్వారా 2019 ఎన్నికల నాటికి హిందువుల ఓట్లను సంఘటితం చేయడానికి అవకాశం వస్తుంది.

ఆ ఉద్దేశం లేకుండానే సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ ఆదేశం మాట ఏలా ఉన్నా ఈ ఆదేశానికి ఉన్న విశిష్టతను ఎలా పరిగణించాలి? 1992 డిసెంబర్ ఆరవ తేదీన వందలాది మంది కర సేవకులు బాబరీ మసీదు గుమ్మటాల మీదకు ఎక్కి పోలీసులు, పత్రికల వారు, ప్రోత్సహిస్తున్న రాజకీయ నాయకులు చూస్తుండగానే బాబరీ మసీదును కూల్చేశారు. తర్వాత రెండు ప్రాథమిక సమాచార నివేదికలు (ఎఫ్.ఐ.ఆర్.)లు దాఖలైనాయి. ఒకటి అద్వానీ తదితర బీజేపీ అగ్రనాయకుల మీద. మరొకటి "గుర్తు తెలియని" లక్షలాది మంది కర సేవకుల మీద. ఈ కేసులపై అనేక సార్లు విచారణ, వాయిదాలు, సవాళ్ల తర్వాత కూడా ఈ కేసు విచారణ ఎక్కడ ఉండేదో అక్కడే ఉంది. ఈ రెండు కేసుల విచారణ వ్యవహారం మన నేర న్యాయ వ్యవస్థలో ఉన్న రుగ్మతను మరో సారి అందరి దృష్టికి తెచ్చింది. ఈ రెండు కేసులలో ఒక దాని మీద రాయబరేలి కోర్టులో, మరొకదానిమీద లక్నో కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఇప్పుడు ఈ రెండు కేసులను కలగలిపి అనవసర వాయిదాలు వేయకుండా, జడ్జీలను మార్చకుండా రెండేళ్లలోగా విచారణ పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అంటే న్యాయ నిర్ణయంలో వ్యవస్థాపరమైన లోపాలు ఉన్నట్టు సుప్రీం కోర్టు అంగీకరించింది.

ఈ విషయంలో మాత్రం సుప్రీం కోర్టును అభినందించాల్సిందే. ఎందుకంటే ఒక్క కేసులో, అది ఎంత ముఖ్యమైంది అయినా నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసినంత మాత్రాన నేర న్యాయంలో పేరుకుపోయిన రుగ్మతలు అమాంతం అంతం కావు. విడని లంకెల ముడిలా ఉన్న న్యాయ వ్యవస్థలో చిక్కుకుని ఏటూ తేలకుండా ఉన్న ఇలాంటి కేసులు వేలాదిగా ఉన్నాయి. వాయిదాలు వేయడం, న్యాయాధీషులను మార్చడం లాంటివే విచారణలో జాప్యానికి కారణం. దీనికి తోడు ప్రభుత్వ న్యాయవాదులు శ్రద్ధ తీసుకోరు. సాక్షులకు రక్షణ కల్పించే వ్యవస్థ లేనందువల్ల కీలకమైన సాక్షులు సాక్ష్యం చెప్పాల్సి వచ్చే దగ్గరికి ఎదురు తిరుగుతారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించేదాకా అయోధ్య కేసులో సుప్రీం కోర్టు జోక్యం లాంటివి అరకొర వ్యవహారంగానే మిగిలి పోతాయి.

పైగా సుప్రీం కోర్టు ఇలాంటి ఆదేశం జారీ చేయడం ఇదే మొదటి సారి ఏమీ కాదు. 2004లో బెస్ట్ బేకరీ కేసులో కూడా సుప్రీం కోర్టు ఇలాంటి ఆదేశమే జారీ చేసింది. 2002 గుజరాత్ మారణకాండ సందర్భంగా వడోదరలోని బెస్ట్ బేకరీలో 14 మందిని హతమార్చారు. అప్పుడు గుజరాత్ లో ఈ కేసు విచారణకు అనుకూలమైన వాతావరణం లేదని భావించిన సుప్రీం కోర్టు విచారణను మహారాష్ట్ర కోర్టుకు బదిలీ చేసింది. అప్పుడు గుజరాత్ లో పరిస్థితి మతపరంగా విషపూరితమైనందువల్ల రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం న్యాయం కోరే వారికి తోడ్పడే పరిస్థితి లేనందువల్ల సుప్రీం కోర్టు కేసును బదిలీ చేస్తూ ఆదేశించింది. సత్యం కనుగొనడానికి "అమూర్తమైన సాంకేతిక అంశాలలో" చిక్కుకు పోకూడదని సుప్రీం కోర్టు భావించింది. కానీ ఇలాంటి సాంకేతిక అంశాలవల్లే 1997లో అలహాబాద్ హైకోర్టు రెండు కేసులను విడివిడిగా ఒక దానిని రాయబరేలీ కోర్టులో మరొక దానిని లక్నో కోర్టులో విచారించాలని ఉత్తర్వు జారీ చేసింది.

సుప్రీం కోర్టు ఈ కేసులపై దృష్టి సారించినందువల్ల పాతికేళ్లుగా నలుగుతున్న బాబరీ మసీదు విధ్వంసం కేసు దేశంపై ఏలాంటి ప్రభావం చూపుతుంది అని ఆలోచించాలి. 1990 సెప్టెంబర్ లో అద్వాణీ రథయాత్ర, మందిర నిర్మాణంకోసం జన సమీకరణ, ఈ పరిణామాలు 1992 డిసెంబర్ లో బాబరీ విధ్వంసానికి దారి తీయడం వల్ల దేశంలో మత ప్రాతిపదికన జన సమీకరణ జరిగింది. హిందుత్వ వాదులు పురోగమించారు. దీనివల్ల 2014 లోక సభ ఎన్నికలలో బీజేపీకి అధికారం దక్కింది. ఇటీవల అయిదు రాష్ట్రాలలో జరిగిన శాసన సభ ఎన్నికల ఫలితాలు కూడా బీజేపీకే అనుకూలంగా ఉన్నాయి. అనేక రాష్ట్రాలలో ముఖ్యంగా 1992లో మహారాష్ట్రలో, 2002లో గుజరాత్ లో మతకలహాలు, ఆ తర్వాత బాబరీ మసీదు కూల్చివేత వంటి పరిణామాల కారణంగా  ప్రజాస్వామ్య దేశంలో తాము మిగతా వారితో సమానులం కాము అన్న అభిప్రాయం ముస్లింలలో కలిగింది. 2014లో మత విద్వేషం మరింత పెరగడం వల్ల ముస్లింలలో అభద్రతాభావం మరింత ఎక్కువైంది.

సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల వల్ల బీజేపీ అగ్ర నాయకులకు కంటి మీద కునుకు లేకుండా పోయిన పరిస్థితి ఏమీ లేదు. సుప్రీం కోర్టు ఆదేశం తర్వాత ఉమా భారతి విజయ గర్వంతో చేసిన ప్రకటనను బట్టి చేస్తే ఈ ఆదేశం బీజేపీ దృష్టిలో దేవుడిచ్చిన అవకాశంలా ఉంది. అద్వాణీ తదితరులు బాబరీ విధ్వంసానికి కుట్ర పన్నినట్టు అంతిమంగా తేలినా బీజేపీ నాయకులు విచారించవల్సింది ఏమీ ఉండదు. ఎందుకంటే ఉన్నత న్యాయస్థానాలలో అప్పీలు చేసుకునే అవకాశం ఎటూ ఉంటుంది. ఒక వేళ వారు నిర్దోషులని తేలితే బీజేపీకి అంతా లాభమే. నిజానికి మతోద్రిక్తతలు పెరిగిన దశలో ఎలాంటి తీర్పు వచ్చినా దానిని ఎన్నికల ప్రయోజనానికి వినియోగించుకోవచ్చు.

స్వాతంత్ర్యానంతర భారత చరిత్రలో ఇలాంటి ఉదంతాలు అనేకం ఉన్నాయి. అయినా 1992 డిసెంబర్ ఆరు సంఘటన ప్రత్యేకమైంది. ఎందుకంటే అది హిందుత్వ రాజకీయాలకు ఊతం ఇచ్చింది. ఆ ఫలితం నిరంతరం కనిపిస్తూనే ఉంది. రెండేళ్ల కాలంలో లక్నో కోర్టు వెలువరించే తీర్పు ఆ ప్రయోజనం పొందడానికి మరో అవకాశం ఇస్తుంది. 

Updated On : 13th Nov, 2017
Back to Top