ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

సంఘటిత శక్తి ఫలించిన వేళ

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

పదేళ్ల సుధీర్ఘ పోరాటం తర్వాత, మొదట పారిశ్రామిక ట్రిబ్యునల్, తర్వాత హై కోర్టు చివరకు సుప్రీం కోర్టు దాకా వెల్లిన 2,700 మంది బృహన్ ముంబై కార్పొరేషన్ (బి.ఎం.సి.) పారిశుధ్య కార్మికులు ఎట్టకేలకు శాశ్వత్ ఉద్యోగాలు సంపాదించగలిగారు. ఈ అన్ని దశల్లోనూ ప్రతి సారీ  కార్మికులకు అనుకూలంగానే తీర్పులు వచ్చాయి. కార్మికులకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పుడల్లా బి.ఎం.సి. అప్పీలు చేసి చివరకు అపజయం పాలైంది. కచ్రా వాహతుక్ శ్రామిక్ సంఘ్ (కె.వి.ఎస్.ఎస్.) పదేళ్లపాటు కార్మికులను సంఘటితంగా ఉంచడంలో సఫలమైంది. ఇది సంఘటిత శక్తి, ఉమ్మడి పోరాటం కొనసాగించడం, కార్మిక సంఘంగా ఏర్పడి పోరాడితే ఎన్నటికైనా విజయం తథ్యం అనడానికి నిదర్శనం. దేశంలో కార్మికోద్యమం బలహీనపడి, కార్మికోద్యమ పని అయిపోయింది అని కేరింతలు కొడుతున్న సమయంలో ఈ విజయం గణనీయమైంది.

అయితే న్యాయపరంగా సాధించిన ఈ విజయం కార్మికుల పోరాటానికి అంతం అని అనుకోకూడదు.

చెత్తా చెదారాన్ని సేకరించడం, రవాణా చేయడం వల్ల అనేక చర్మ రోగాలు, శ్వాసకోశ సంబంధ రోగాలు అంటుకుంటాయి. ఈ కార్మికులందరూ సాధారణంగా కింది కులాలకు చెందిన వారే. మురుగు శుద్ధి కార్మికులలాగే పారిశుధ్య కార్మికులు కూడా ముంబైలో, త్వరగా విస్తరిస్తున్న ఇతర పట్టణాలలో అనివార్యంగా ఈ పనులు చేయాల్సిందే. కాని సమాజం వీరు చేసే పనిని గుర్తించదు. వ్యక్తులుగా వారిని అసలే గుర్తించదు. పని చేసే చోట, వారు నివసించే చోట ఉన్న పరిస్థితి నుంచి తప్పించుకోవడం కోసం ఈ కార్మికులలో చాలా మంది  మద్యపానం లాంటి వాటికి అలవాటు పడుతూ ఉంటారు. కాని ఈ కార్మికులకు వారు స్త్రీలైనా, పురుషులైనా ఉద్యోగ భద్రత ఉండదు. జబ్బు పడితే సెలవులు ఉండవు. పని చేసే క్రమంలో మరణిస్తే వారి కుటుంబాలకు పరిహారం దక్కదు. వ్యవస్థీకృతమైన ప్రభుత్వోద్యోగులకు, ఇతర ఉద్యోగులకు ఉన్నట్టుగా ఎలాంటి సంక్షేమ పథకాలూ ఉండవు. కె.వి.ఎస్.ఎస్., రోడ్ల మీద చెత్తా చెదారం ఏరి బతికే కార్మికుల సంఘాలు వారి కోర్కెలను తీర్చుకోవడం కోసం సమస్యలను పరిష్కరించుకోవడం కోసం, ప్రభుత్వ దృష్టికి తమ దుస్థితిని తీసుకు రావడం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాయి. పారిశుధ్య కార్మికులకు కనీస వెతనాలు, ఇతర సదుపాయాలు సమకూరడానికి ఆ కార్మిక సంఘాలు కృషి చేస్తూనే ఉన్నాయి.

పారిశుధ్య కార్మికులను కాంట్రాక్టర్లు నియమిస్తారు కనక తాము వారిని ఉద్యోగాలలో నియమించడం లేదని బి.ఎం.సి. ఈ కేసు విచారణ సందర్భంలో వాదించింది. ఈ పద్ధతి ప్రకారం ప్రతి మునిసిపల్ వార్డును కొన్ని విభాగాలుగా విభజించి స్వచ్ఛంద సంస్థల నుంచి, సహకార సంఘాల నుంచి టెండర్లు పిలిచి రోడ్లు ఊడ్వడానికి, శుభ్రం చేయడానికి, వ్యర్థ పదార్థలను రవాణా చేయడానికి కార్మికులను నియమించే పని ఈ ప్రభుత్వేతర సంస్థలకు అప్పగిస్తారు. ఈ కార్మికులతో తమకు "ఉద్యోగి-యజమాని" సంబంధం లేదని బి.ఎం.సి. వాదించింది. ఇలాంటి విధానాన్ని "హైదరాబద్ విధానం" అంటారు. కాని కాంట్రాక్టర్లకు ఈ విషయంలో నైపుణ్యం లేనందువల్ల కార్మికులకు వేతనాలు బి.ఎం.సి.నే చెల్లిస్తోందని కె.వి.ఎస్.ఎస్. వాదించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం మురుగు కాలవలను శుద్ధి చేయడం, ఘన రూప వ్యర్థ పదార్థాలను తొలగించడం మొదలైన పనులు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఉన్నాయని కూడా వాదించింది. కాంట్రాక్టర్ చేసే ప్రతి పనిని బి.ఎం.సి.నే నియంత్రిస్తుందని, కార్మికుల నియామకం కూడా బి.ఎం.సి. వార్డు కార్యాలయంలోనే జరుగుతుందని, పని అప్పగించడం కూడా బి.ఎం.సి. అధీనంలోనే జరుగుతుందని కూడా కె.వి.ఎస్.ఎస్. వాదించింది.

పదేళ్ల పాటు మూడు స్థాయిల్లో కోర్టు కేసులు నడపడం కె.వి.ఎస్.ఎస్.కు శక్తికి మించిన పనే. కార్మిక పోరాటాలలో అవ్యవస్థీకృత కార్మికులను సంఘటితం చేయడం చాలా క్లిష్టమైన వ్యవహారం. ఉద్యోగ భద్రత లేనందువల్ల, అణగారిపోయి ఉన్నందువల్ల చాలా మంది కార్మిక సంఘాలలో చేరడానికి భయపడతారు. ఒక వేళ చేరినా శక్తివంతమైన సంస్థతో పోరాడడానికి అనేక ప్రతికూలతలు ఉంటాయి. అయినా కె.వి.ఎస్.ఎస్. ఈ కార్మికులను సంఘటితం చేయడమే కాక వారిని సమైక్యంగా ఉంచడంలో సఫలమైంది. ఈ కార్మికుల పోరాటంలో విద్యార్థుల, పత్రికా రచయితల, ఆరోగ్య, న్యాయ వ్యవహారాల కార్యకర్తల, చిత్ర పరిశ్రమ వారి మద్దతు కూడా సమీకరించగలిగింది. సమాజానికి తమ పరిస్థితిని తెలియజేయడానికి ఈ కార్మిక సంఘం తమ వెబ్ సైట్ ను, బ్లాగ్ ను కూడా వినియోగించుకుంటుంది.

న్యాయపరంగా కె.వి.ఎస్.ఎస్. సాధించిన విజయం దేశ వ్యాప్తంగా ప్రభుత్వ, అధికారుల కుటిలనీతిని బయట పెట్టింది. ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి గొప్పగా మాట్లాడుతుంటాయి కాని నగరాన్ని శుభ్రం చేసే వారిని మాత్రం లెక్క చేయవు. ప్రముఖులు, మంత్రులు చీపుర్లు పట్టుకుని ఊడ్వడంలో ఉన్న కపటాన్ని ఈ కార్మిక సంఘం తమ వెబ్ సైట్ లో ఎండగట్టింది. ఒక వర్గం వారి పరిశుభ్రత కోసం మరో వర్గం వారిని "ఇతరులకు బానిసలు"గా మార్చకూడదని సుప్రీం కోర్టు చాలా సముచితమైన వ్యాఖ్య చేసింది. ఈ మాటను ప్రభుత్వం, పౌర సమాజం గ్రహించాలి.  

Updated On : 13th Nov, 2017
Back to Top