ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

భూమాతకు మరణ శిక్ష

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

శీతోష్ణ స్థితిలో మార్పులు ఒట్టి బూటకమని డోనాల్డ్ ట్రంప్ పదే పదే అంటున్నారు. ఉదాహరణకు 2014 జనవరి 2న ఆయన ప్రపంచంలోని శీతోష్ణ స్థితి శాస్త్రవేత్తలను "చాలా ఖరీదైన ఈ భూతాపం అన్న భావనే ఒట్టి చెత్త" అని మందలించారు. 2017 జూన్ ఒకటిన అమెరికా అధ్యక్షుడి హోదాలో ట్రంప్ 2015నాటి పారిస్ శీతోష్ణ స్థితి ఒప్పందం నుంచి విరమించుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మాట దిగ్భ్రాంతికరమైందే కాని ఊహించనిది ఏమీ కాదు. ప్రపంచంలో విడుదలయ్యే కాలుష్యపూరిత ఉద్గారాలలో అమెరికా విడుదల చేసే హరిత గృహ వాయువులే 15 శాతం ఉన్నాయి. కొచ్ సోదరులు పెట్టుబడి పెట్టే అమెరికన్ ఎనర్జీ అలయన్స్ తరఫున థామ పైల్ రూపొందించిన ట్రంప్ శీతోష్ణ స్థితి విధానం 2016 డిసెంబర్ లో బయటకు పొక్కింది. ఈ నివేదిక ట్రంప్ శీతోష్ణ స్థితి విధానం ఎలా ఉంటుందో టూకీగా తెలియజేసింది. 1) పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడం 2) ఒబామా రూపొందించిన కాలుష్య రహిత ఇంధన ప్రణాళికను రద్దు చేయడం 3) కీస్టోన్ పైప్ లైన్ పథకంతో సహా పైప్ లైన్ పథకాలన్నింటినీ ఆమోదించడం.

అమెరికా పాలక వర్గాలలోని శిలాజ ఇంధన కంపెనీలకు చెందిన కొన్ని వ్యాపార వర్గాల వారిని ట్రంప్ సలహాదారులు సమర్థిస్తారనడంలో సందేహం లేదు. కాని పారిస్ ఒప్పందం నుంచి బయటకు రావడం ఈ వ్యాపారవర్గాలకు కూడా నచ్చడం లేదు. పశ్చిమ యూరప్, జపాన్ కు కూడా ట్రంప్ విధానం మింగుడు పడలేదు. "అమెరికాకే ప్రాధాన్యం" అన్న ట్రంప్ నినాదం పశ్చిమ యూరప్, జపాన్, అమెరికాతో కూడిన త్రికూటమిలో అమెరికా నాయకత్వాన్నే నీరుగార్చింది.

శిలాజ ఇంధన వ్యాపారంపై గుత్తాధిపత్యం ఉన్న కొచ్ బ్రదర్స్ తో సహా, ట్రంప్ ఎన్నికల ప్రచారానికి భారీగా పెట్టుబడి పెట్టిన బడా వ్యాపరస్థులు, పరిశ్రమల అధిపతులు శీతోష్ణ స్థితి మార్పుల గురించి ఆందోళన వక్యం చేశారు. ఈ మార్పుల వల్ల భవిష్యత్ తరాల వారి మీద ప్రతికూల ప్రభావం ఉంటుందని కూడా చెప్పారు. పారిస్ ఒప్పందం నుంచి వైదొలగాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై గోల్డ్ మాన్ సాక్స్ ప్రధాన కార్యనిర్వహణాధికారి లాయ్డ్ బ్లాంక్ఫీన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "ఈ నిర్ణయం పర్యావరణానికి, ప్రపంచంలో అమెరికా నాయకత్వ స్థానానికి ముప్పు కలిగిస్తుంది" అని ఆయన అన్నారు. నిజానికి పారిస్ ఒప్పందాన్ని బహుళ జాతి ఇంధన సంస్థ ఎక్సాన్ మొబిల్ సమర్థించింది. పర్యావరణ పరిరక్షణ సంస్థ అధిపతి స్కాట్ ప్రూట్, అతి మితవాద బ్రీబార్ట్ న్యూస్ అధిపతి స్టీఫెన్ బానన్ మొదలైన ట్రంప్ పరిపాలనా బృందంలోని వారు శీతోష్ణ స్థితి మార్పు లేనే లేదని వాదించే వారు. కాని ప్రస్తుతం అమెరికా విదేశాంగ మంత్రిగా ఉన్న రెక్స్ టిల్లెర్సన్ శీతోష్ణ స్థితి మార్పు ముప్పు లేదు అనే వాదనను విశ్వసించకూడదని అన్నారు.

మొత్తం మీద అమెరికా, పశ్చిమ యూరప్, జపాన్ తో కూడిన త్రికూటమి దేశాలకు చెందిన అధికార పక్షాల ప్రతినిధులు పెట్టుబడి దారీ విధాన ఆధునీకరణ అనివార్యం అన్న నిర్ధారణకు వచ్చారు. కాని పారిస్ ఒప్పందంలోని అంశాలను నిబద్ధమై ఉండాల్సినవిగా కాకుండా ఉద్దేశపూర్వకంగానే వాటిని స్వచ్ఛందంగా అమలు చేయాల్సిన విషయాలుగా ఉంచేశారు. పారిస్ ఒప్పందంలోని అంశాల అమలును పర్యవేక్షించే వ్యవస్థ లేదు. అమలు చేయని దేశాలపై ఆంక్షలు విధించే ఏర్పాటూ లేదు. ఒబామా ప్రభుత్వం రూపొందించిన కాలుష్య రహిత ఇంధన విధానం పర్యావరణ పరిరక్షణ సంస్థకు పర్యవేక్షణాధికారాలు కట్టబెట్టింది. విద్యుత్ కర్మాగారాలు వెదజల్లే బొగ్గుపులుసు వాయువులను నియంత్రించే బాధ్యతను ఒబామా ప్రభుత్వం ఈ సంస్థకు అప్పగించింది. కాలుష్య రహిత వాయువు చట్టం కింద ఆ సంస్థ ఈ పని చేయడానికి అవకాశం కల్పించారు. కాని శిలాజ ఇంధన సంస్థలకు దన్నుగా ఉండే అమెరికాలోని రాష్ట్రాలు ఈ ఆదేశాల అమలు నిలిపి వేయాలని అభ్యర్థిస్తూ వ్యాజ్యం దాఖలు చేశాయి. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం అసలు ఈ ప్రణాళికనే రద్దు చేస్తోంది.

త్రికూటమి దేశాల పాలక వర్గాలు, వాటి ప్రతినిధులు పారిస్ ఒప్పందాన్ని ఇంతకు ముందు సమర్థించడానికి కారణం ఆ ఒప్పందం పూర్తిగా స్వచ్ఛందం కావడమే. క్యోటో ఒప్పందంలో అమెరికా, ఇతర అభివృద్ధి చెందిన దేశాలు తప్పని సరిగా అమలు చేయవలసిన అంశాలు ఉండేవని గుర్తు చేసుకోవాలి. కాని క్యోటో ఒప్పందాన్ని ఆమోదించడానికి అమెరికా నిరాకరించింది. భూగోళ కవోష్ణత నుంచి ఉపశమనం కలిగించడానికి అమెరికా చేసింది ఏమీ లేదు. నిజం చెప్పాలంటే స్వచ్ఛంద నియమాలు, నిబద్ధమై ఉండనవసరం లేని అంశాల వల్ల లక్ష్యాలు సాధించడం కుదరదు. మరో వేపున శీతోష్ణ స్థితిని పరిశీలించడంతో సంబంధం ఉన్న ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలోని trillionthtonne,org కు చెందిన శాస్త్రవేత్తలు హరిత గృహ వాయువులను అదుపు చేయడానికి ఏమీ చేయకపోతే పారిశ్రామిక అభివృద్ధి లేని దశతో పోల్చుకుంటే ఉష్ణోగ్రత రెండు డిగ్రీలు పెరుగుతందని, ఈ పెరుగుదల 20 ఏళ్ల కాలంలో ఇక నిలవరించడానికి వీలు లేనంతగా తయారు అవుతుందని హెచ్చరించారు. కాని హరిత గృహ ఉద్గారాలకు బాధ్యులైన సంపన్న దేశాల నాయకులు వాటంగా కాలుష్య నివారణ చర్యలను స్వచ్ఛందమైనవిగా ఉంచేసి "రోం తగలబడుతూ ఉంటే ఫిడేలు వాయించిన రీతిలో" వ్యవహరించాయి.

పెట్టుబడి సమకూర్చుకునే, శ్రామిక వర్గాన్ని దోపిడీ చేసే వ్యవస్థ అయిన పెట్టుబడిదారీ విధానం పోటీ, వివిధ వర్గాల మధ్య అంతరం వల్ల ప్రకృతి ఇక భరించరాని స్థితికి వచ్చేట్టు చేసింది. భారీ స్థాయిలో శిలాజ ఇంధనాలు ఉత్పత్తి చేస్తే ప్రకృతి తట్టుకునే అవకాశం లేదు. పెట్టుబడిదారీ విధానం వల్ల లబ్ధి పొందే శక్తిమంతమైన వర్గాలు, పర్యావరణ పరిరక్షణను తీవ్రంగా వ్యతిరేకించే వర్గాలు ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ వర్గాలకు ప్రతినిధి అయిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పారిస్ ఒప్పందం నుంచి ఉపసం హరించుకోవడం ద్వారా భూ మాతకు మరణ శిక్ష విధించారు. ఆయనని సమర్థించే పెట్టుబడిదారీ వర్గాల వారు ఈ మరణ శిక్షను అమలు చేయడానికి తోడ్పడితే మానవ నాగరికత, భూగోళంపై సకల జీవరాసులు అంతం కావడం ఖాయం.

 

  

Updated On : 13th Nov, 2017
Back to Top