ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ప్రైవేటు కబంధ హస్తాల్లో ఆరోగ్యం

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

మోదీ ఆరోగ్య పథకం వల్ల మూడవ శ్రేణి, నాల్గవ శ్రేణి నగరాలలో ప్రైవేటు ఆరోగ్య సంరక్షణ మార్కెట్లు విస్తరించి ప్రైవేటు ఆరోగ్య సేవలు పెరుగుతాయి అని నీతీ ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ ఇటీవల అన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ ఆరోగ్య సదుపాయాలు అందుబాటు ధరల్లో ఉంటాయని కూడా ఆయన చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరమైనవి. ఎందుకంటే ఆరోగ్యరంగం ఇతర వస్తువుల మార్కెట్లలాగా ఉండదు. ఉండకూడదు.

ఆరోగ్య సేవల డిమాండు ఆ సేవలు అందుబాటులో ఉండే అంశంపై ఆధారపడి ఉంటుంది. ఈ అందుబాటులో ఉండడం ఆ సేవలు అందించే సదుపాయాలపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్య సేవల విషయంలో సమాచారం సవ్యంగా లేనందువల్ల ఆరోగ్య సేవలు అందించే వారు ఇచ్చే సమాచారం మీదే రోగులు ఆధారపడతారు. రోగ నిదాన పరీక్షలు, సిఫార్సు చేసే మందులు, ఇతర ప్రక్రియల మీద కూడా ఈ అంశాలు ఆధారపడి ఉంటాయి.

మహారాష్ట్రలోని ఆహార, ఔషధ నిర్వహణ విభాగం ఇటీవల కొన్ని ప్రసిద్ధ ప్రైవేటు ఆసుపత్రులలో దర్యాప్తు చేసినప్పుడు వాటిల్లో మూత్రవిసర్జక నాళికలు మొదలైనవి ఒకరికి వాడిన తర్వాత మళ్లీ ఇతరులకు వాడుతున్నట్టు తేలింది. వాటిని ముందు ఇతరులకు నిర్ణీత ధరకన్నా మూడు రెట్ల ఎక్కువ ధరకు అమ్మి తర్వాత మరోసారి ఇతరులకు వినియోగిస్తారు. ఇలాంటి వ్యవహారాలవల్ల రోగులు చెల్లించవలసిన బిల్లులు పెరుగుతాయి. ఇది మోసం కూడా. వాడిన పరికరాలనే మళ్లీ వాడినందువల్ల జబ్బులు కూడా సోకవచ్చు. దానికి చికిత్స చేసుకోవలసి రావచ్చు. అంటే రోగులు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. లాభ పడేది మాత్రం ప్రైవేటు ఆరోగ్య సంస్థలే.

ఆరోగ్య రంగంలో దుష్ప్రవర్తన, దుర్మార్గాలు అన్ని విషయాల్లోనూ పెరిగిపోయాయి. రోగ నిర్ధారణ పరీక్షలు అవసరం లేకపోయినా జరిపించి అందులో కమిషన్లు సంపాదించడం, అనవసరంగా పెద్ద ఆసుపత్రులకు వెళ్లమని సలహాలు ఇవ్వడం, అనవసరమైన పరీక్షలు చేయించడం, మందులు రాసి వాటి మీద కూడా కమిషన్లు లాగడం, కానుకలు పుచ్చుకోవడం, ఔషధ కంపెనీలు ఏర్పాటు చేసే ఉచిత పర్యాటక సదుపాయాలు వినియోగించుకోవడం, అవయవ మార్పిడులు, రోగుల దగ్గర ఎక్కువ మొత్తం వసూలు చేయడం, బీమాలో మోసాలు మొదలైనవన్నీ సర్వసాధారణమైపోయాయి.

చికిత్సాలయాల చట్టం తీసుకు రావడాన్ని భారత వైద్య సంఘం (ఐ.ఎం.ఎ.) అడ్డుపెడ్తోంది. ఆ చట్టం వచ్చి ఉంటే ఆరోగ్య సదుపాయాలు అందించడాన్ని నియంత్రించడానికి వీలు కలిగేది. ఆరోగ్య రంగంలో ధరలను అదుపు చేయడాన్ని కూడా ఐ.ఎం.ఎ. వ్యతిరేకిస్తోంది. కెనడాలో డాక్టర్ల సంఘం మాత్రం తమకు ఇప్పటికే ఎక్కువ జీతాలు చెల్లిస్తున్నందువల్ల జీతాలు పెంచనవసరం లేదని కోరింది.

కెనడాలోనూ ఇంకా అనేక దేశాల్లోనూ ఉన్న ఆరోగ్య సదుపాయాలు మన దేశంలో లేకపోవడానికి అక్కడ వైద్యులు, వైద్య రంగంలో నీతి నియమాలు ఉంటాయి. మన దేశంలో అవి లేవు. మన దేశంలో ఐ.ఎం.ఎ. ఓ వృత్తి నిపుణుల సంఘంలా కాకుండా వ్యాపార కూటమిలా తయారైంది. వైద్య రంగంపై, ధరలపై నియంత్రణను ఐ.ఎం.ఎ. మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది.

అక్రమాలకు, మోసాలకు పాల్పడే డాక్టర్ల మీద ఒక్క చర్య తీసుకున్న దాఖలాలే లేవు. వైద్య రంగంలో నైతిక విలువలను నెలకొల్పడానికి చేసే ప్రయత్నాలను సాగనివ్వడం లేదు. అందువల్ల మన దేశంలో వైద్య రంగ రాజకీయ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా వ్యాపారంగా మారిపోయింది. లాభాల ధ్యాస తప్ప మరేమీ లేదు.

2017లో రూపొందించిన జాతీయ ఆరోగ్య విధానం, 2018-19 బడ్జెట్ లో ప్రతిపాదించిన ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం (అదే మోదీకేర్) చూస్తే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆరోగ్య విధానాన్ని ఎటు తీసుకెళ్తోందో స్పష్టంగా అర్థం అవుతోంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ తాను నిర్వర్తించవలసిన బాధ్యతను నీతీ ఆయోగ్ కు వదిలేయడం చాలా దురదృష్టకరం. నీతీ ఆయోగ్ చేసే సిఫార్సులన్నీ ప్రైవేట్ ఆరోగ్య సేవల రంగానికి మేలు చేసేలాగానే ఉన్నాయి. ప్రభుత్వ ఆరోగ్య రంగాన్ని ప్రైవేటుకు అప్పగించడానికే అనుకూలంగా ఉన్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు మేలైన, అందరికీ అందుబాటులో ఉండే వైద్య సేవలు అందజేస్తున్నాయి. దాని కోసం పన్నులు విధిస్తున్నాయి. చట్టాలు చేస్తున్నాయి. సామాజిక బీమాకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆ దేశాల్లో ఆదాయం లేదా ఉద్యోగం ఆధారంగా వైద్యం అందించవు. వైద్య సదుపాయాలు అందరికీ సమానంగా అందుబాటులో ఉంటాయి. వైద్య రంగంలో నైతికత అత్యుత్తమ రీతిలో ఉంటుంది. అన్నింటికీ మించి అలాంటి దేశాలలో ఆరోగ్య రంగాన్ని మార్కెట్ దయాదాక్షిణ్యాల మీద వదిలేయరు. ఆరోగ్య సంరక్షణ అక్కడ ప్రభుత్వ బాధ్యత.

ఆరోగ్య విధానాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిలదీయవలసిన అవసరం ఉంది. మన ఉన్నతాధికార వర్గాలకు, పార్లమెంటు సభ్యులకు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సి.జి.హెచ్.ఎస్.) ప్రయోజనాలు ఎందుకు వర్తింప చేస్తున్నారు. ఈ సేవలు కూడా ఇటీవల ప్రైవేటు రంగం ద్వారా అందజేస్తున్నారు.

ఈ పథకం అమలు చేయడానికి సి.జి.హెచ్.ఎస్. పథకం కోసం 2015లో రూ. 6, 300 కోట్లు ఖర్చు అయింది. కాని ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం ప్రతి వ్యక్తికి సంవత్సరానికి కేటాయించేది రూ. 1,100 కన్నా తక్కువ. ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అందరికీ వైద్యం అని ప్రచారం చేస్తూనే ఉంటుంది. కాని ప్రభుత్వ విధానాలు చాలా మందికి వైద్య సదుపాయాలు అందుబాటులో లేకుండా చేస్తున్నాయి. ఆరోగ్య సేవల విషయంలో అసమానతలు పెరిగిపోతున్నాయి.

మారాల్సింది ఇదే. ఆరోగ్య సదుపాయాలకు మార్కెట్ తో సంబంధం ఉండకూడదు. అవి ప్రజా సంక్షేమానికి తోడ్పడాలి. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఇదే మార్గం అనుసరిస్తున్నాయి. మరి మన దేశం ఆ పద్ధతులు ఎందుకు అనుసరించకూడదో అర్థం కాదు. నిజానికి మిజోరం, సిక్కిం, గోవా, పుదుచ్చేరి, అండమాన్, నికోబార్ దీవుల్లో అనేక దేశాలలో అనుసరిస్తున్న విధానాలనే అనుసరిస్తున్నారు. అక్కడి బడ్జెట్లో ఏటా తలసరిగా రూ. 4,000 కేటాయిస్తున్నారు.

ప్రభుత్వం ఆ పని చేయడానికి కారణం అక్కడ ప్రైవేటు వైద్య సదుపాయాలు పెద్దగా అందుబాటులో లేకపోవడమే. ఆ రాష్ట్రాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పటిష్ఠంగా ఉన్నాయి. ప్రభుత్వ లక్ష్యం నిజంగా ఆయుష్మాన్ భారత్ అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉత్తమ పద్ధతులను, మన దేశంలోనే వివిధ రాష్టాలలో ఉన్న విధానాలను అనుసరించాలి. ఆరోగ్య రంగాన్ని ప్రైవేటు రంగ కబంధ హస్తాలకు అప్పగించకూడదు.

Back to Top