ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ప్రాణాలు మింగేస్తున్న క్షయ వ్యాధి

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ప్రపంచ వ్యాప్తంగా క్షయ వ్యాధి తగ్గుముఖం పడ్తోంది. అయితే 2017లో ప్రపంచంలో కోటి మందికి క్షయ వ్యాధి సోకింది. 16 లక్షల మంది ఈ జబ్బు సోకి మరణించారు. అంటే క్షయ ఇంకా మానవాళిని వెంటాడుతూనే ఉంది. ఈ వ్యాధిని గుర్తించి దాదాపు వందేళ్లయింది. దీన్ని మనిషిని తీనెసే వ్యాధి అనే వారు. ఈ వ్యాధి సోకిన రోగులే కాక వారి కుటుంబ సభ్యులు కూడా యమయాతన పడవలసి వస్తుంది. వాళ్లను వేలేసినట్టుగా చూస్తారు. సామాజికంగా, ఆర్థికంగా చితికి పోతారు. గత సెప్టెంబర్ 26న ఐక్య రాజ్య సమితి మొట్టమొదటి సారి క్షయ వ్యాధి మీద సమావేశం నిర్వహించి 2030 చివరి నాటికి ఈ వ్యాధిని నిర్మూలించాలని అందుకు కావలసిన నిధులు పెంచాలని నిర్ణయించింది. అప్పుడే నిలకడగా ఉండే అభివృద్ధి లక్ష్యాలు సాధించడం సాధ్యం అని భావించింది. ప్రపంచంలోని క్షయ వ్యాధి గ్రస్థుల్లో 27 శాతం మంది భారత్ లోనే ఉన్నారు. ఈ ఏడాది ఆరంభంలో క్షయ వ్యాధి నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2025 కల్లా ఈ లక్ష్యం సాధించాలని భారత్ సంకల్పించింది. మన దేశంలో ఉన్న ఆరోగ్య వ్యవస్థను బట్టి చూస్తే ఇది సాధ్యమయ్యేలా కనిపించదు.

క్షయ వ్యాధి సోకిన వారి గురించి సమాచారం అందనందువల్ల ఎంత మంది ఈ వ్యాధితో బాధ పడ్తున్నారు, దాన్ని ఎలా అదుపు చేయాలి, చికిత్స ఎలా అందించాలో కచ్చితంగా నిర్ణయించుకోలేక పోతున్నాం. ప్రపంచంలో కోటి మంది ఈ వ్యాధితో బాధపడుతున్నా ఈ వ్యాధి ఉన్నట్టు తెలిపిన వారు కేవలం 64 లక్షల మందే. ఇలా బయటకు చెప్పకుండా ఉన్న వారిలో మన దేశంలోనే 26 శాతం ఉన్నారు. 2013 నుంచి క్షయ వ్యాధి సోకినట్టు తెలియడం మన దేశంలో నిజానికి పెరిగింది. ప్రైవేటు ఆరోగ్య రంగం నుంచి ఈ సమాచారం అందుతోంది. ఈ వ్యాధిని గుర్తించవచ్చు. చికిత్స అందితే కచ్చితంగా నయం అవుతుంది.

2012లో భారత్ "నిక్ష్యయ" విధానం ప్రారంభించింది. దీని ప్రకారం వైద్యులు, చికిత్సాలయాలు క్షయ వ్యాధి గ్రస్థుల వివరాలు ఆన్ లన్లో నమోదు చేయవచ్చు. ప్రైవేటు వైద్య రంగంలోని వారు ఈ వివరాలు నమోదు చేయాలన్న దృష్టితోనే "నిక్ష్యయ" ప్రారంభించారు. అయితే ఆచరణలో ఈ విధానానికి అనేక అడ్డంకులు ఎదురైనాయి. ఈ వ్యవస్థ గురించి తెలియకపోవడం, వ్యాధి గురించి తెలియజేయడానికి ఇష్టం లేకపోవడం, వ్యాధి మీద అపోహలు ఉండడం, తెలిసిన వివరాలు సరిగ్గా నమోదు చేయకపోవడంవంటి సమస్యలు తప్పడం లేదు. ఈ వ్యాధి గురించి తెలియజేసే వారికి ప్రోత్సాహకాలు ఏవీ లేకపోవడం మరో పెద్ద సమస్య. ప్రైవేటు వైద్య రంగం ఇదివరకు ఈ వ్యాధి గురించి తెలియజేసేదే కాదు. ఇప్పుడు పరిస్థితి కొద్దిగా మెరుగు పడింది. అయితే అదీ మందకొడిగానే సాగుతోంది. చైనాలో క్షయ వ్యాధిని నివారించగలుగుతున్నారు. అక్కడా ఆన్ లైన్లో తెలియజేసే వ్యవస్థే అమలులో ఉంది. క్షయ వ్యాధి సోకిన వారి గురించి తెలియజేయక పోవడం దండనీయమని 2018లో భారత ప్రభుత్వం గజెట్ ఉత్తర్వు జారీ చేసింది. ఔషధాలు తయారు చేసే వారు, అమ్మే వారు కూడా ఈ వివరాలు తెలియజేయాలని చెప్పారు. ఎవరికి ఔషధాలు అమ్మారో వివరాలు నమోదు చేయాలి. క్షయ వ్యాధి సోకిన వారు స్వయంగా కూడా ఆన్ లైన్లో సమాచారం ఇవ్వ వచ్చు. ఈ వివరాలు తెలియజేసే వారికి డబ్బు రూపంలో ప్రోత్సాహకాలు కూడా ఉన్నాయి.

ఈ వ్యాధి సోకిన వారికి చికిత్స చేయడం ఎంత ముఖ్యమో ఈ వివరాలు కచ్చితంగా, నిరంతరంగా నమోదు చేయడం కూడా అంతే అవసరం. వ్యాధి సోకిన వారి వివరాలు నమోదు చేయడం పెరిగింది కాని చికిత్సకు సంబంధించిన వివరాల నమోదు సంతృప్తికరంగా లేదు. 2016లో ఈ వ్యాధి సోకినట్టు నివేదించిన వారిలో 26 శాతం మందికి అందించిన చికిత్స ఏమిటో వివరాలు నమోదు కానే లేదు. చికిత్స సవ్యంగా అంది దానివల్ల ఫలితాలు సవ్యంగా లేకపోతే రోగులు మళ్లీ ఇబ్బందిలో పడే అవకాశం ఉంటుంది. అలాంటి వారికి ఆ తర్వాత మందులు పని చేయని స్థితి వస్తుంది. తెలిసిన కేసుల్లో 69 శాతం మందికి చికిత్స అందింది. మందులు పని చేయని 46 శాతం మందికి అందిన చికిత్స సంతృప్తికరంగా లేదు. క్షయ, ఎయిడ్స్ సోకిన ఇళ్లల్లో ఉండే అయిదేళ్ల లోపు పిల్లలకు వ్యాధి నిరోధక చర్యలు తక్కువగా ఉన్నాయి.

ప్రపంచ జనాభాలో 23 శాతం మందికి నిగూఢంగా ఈ వ్యాధి ఉంది. ఈ వ్యాధి ఇతరులకు సోకకుండా నివారించడం తప్పని సరి. మద్యపానం, పొగ తాగడం, మధుమేహం, ఎయిడ్స్, పోషకాహార లోపం ఈ వ్యాధి సోకడానికి అయిదు ప్రధాన కారణాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2018నాటి అంతర్జాతీయ  క్షయ నివేదికలో తెలియజేసింది. మన దేశంలో పోషకాహార లోపం ఈ వ్యాధి సోకడానికి ప్రధాన కారణం. వర్ధమాన దేశాలలో పేదలు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడ్తుంటారు. ముఖ్యంగా పిల్లలకు ఎక్కువగా సోకుతుంది. పోషాకాహరం, పేదరికం, ఆరోగ్య సదుపాయాలవంటి ఇతర ఆరోగ్య సూచికలు మెరుగు పడితే ఈ వ్యాధిని నిరోధించడం, చికిత్స చేయడం సాధ్యం అవుతుంది. మన దేశంలో 60 ఏళ్ల కిందటి సమాచారం ఆధారంగా ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నాం. 1955లో జాతీయ స్థాయిలో క్షయ వ్యాధిపై సర్వే నిర్వహించారు. ఆ సర్వేనే ఇప్పటికీ ఆధారం చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు సర్వే నిర్వహించగలిగితే నివారణ, వ్యాధిని గుర్తించడం, చికిత్స చేయడం సులభం అవుతాయి. 2019/2020లో మళ్లీ ఇలాంటి సర్వే నిర్వహించాలనుకుంటున్నారు. అంటే కేవలం అంచనాల మీద కాకుండా మరింత నమ్మదగిన సమాచారం ఆధారంగా తగిన చర్య తీసుకోవడానికి ఇంకా సమయం పడ్తుంది.

ఈ వ్యాధి ప్రాణాంతకమైంది. త్వరగా వ్యాపిస్తుంది. వివిధ రకాల క్షయ వ్యాధులను గుర్తించడం, కొత్త టీకాలు కనిపెట్టడం, కొత్త మందులు వాడడం, తక్కువ కాలం చికిత్సతో నయం చేయడంవంటివి ఇంకా మందకొడిగానే సాగుతున్నాయి. ఎయిడ్స్ మీద చూపే శ్రద్ధ ఈ వ్యాధి మీద కనిపించడం లేదు. వివిధ మందులు వాడినా పని చేయని క్షయను నివారించడానికి 40 ఏళ్ల తర్వాతే బెడాక్విలైన్, డెలమనిడ్ వంటి రెండు మందులు ఇటీవలే అందుబాటులోకి వచ్చాయి. టీకా మందు తయారు చేయవలసిన అగత్యం ఉంది. పరిశోధన, మందులు తయారు చేయడం, అవి ఎలా పని చేస్తాయో చూడడం, కొత్త మందులు కనిపెట్టడానికి దశాబ్దాలు పడ్తుంది. ప్రపంచ దేశాలు, ముఖ్యంగా ఈ వ్యాధి సోకిన వారు ఎక్కువగా ఉన్న భారత్ వంటి దేశాలు తీవ్రంగా కృషి చేయకపోతే 2030 కల్లా ఈ వ్యాధిని పారదోలడం అసాధ్యం.

Back to Top